Charlapalli: దిశ నిందితులను ఇతర ఖైదీలు చంపేస్తారేమోనని ఆందోళన చెందుతున్న చర్లపల్లి జైలు అధికారులు!

  • ఆత్మహత్య చేసుకోకుండా, దాడి జరుగకుండా చర్యలు
  • హై సెక్యూరిటీ బ్లాక్ లో ఉంచి కట్టుదిట్టమైన భద్రత
  • నలుగురూ మానసికంగా బలహీనపడి పోయారన్న అధికారులు

హైదరాబాద్ శివార్లలో 27 ఏళ్ల వెటర్నరీ డాక్టర్ ను రేప్ చేసి, దారుణంగా హతమార్చిన నలుగురు నిందితులూ ఇప్పుడు చర్లపల్లి జైల్లో ఉండగా, వారిని ఇతర ఖైదీలు హత్య చేస్తారేమోనని జైలు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో నిందితులు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను హై సెక్యూరిటీ బ్లాక్ లో ప్రస్తుతం ఉంచారు. ఈ బ్లాక్ లోని గదుల్లో ఒక్కొక్కరినీ ఒక్కో గదిలో ఉంచారు. 24 గంటలూ కాపలా పెట్టారు.

2012లో న్యూఢిల్లీ నిర్భయ కేసులో నిందితుడైన రామ్ సింగ్, తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అటువంటి ఘటనే ఇక్కడ జరుగకుండా చూడాలని, ఇతర ఖైదీలు వారిపై దాడి చేయకుండా చూడాలని జైలు అధికారులు భావిస్తున్నారు. నిందితులు నలుగురూ మానసికంగా బలహీనపడి పోయారని, నిద్ర పోవడం లేదని జైలు అధికారి ఒకరు తెలిపారు.

వీరిపై ప్రజలకు ఉన్న ఆగ్రహం నేపథ్యంలో, ఇతర ఖైదీలు దాడి చేయకుండా చూస్తున్నామని తెలిపారు. ఇతర ఖైదీలు ఇంతవరకూ వీరితో మాట్లాడటం లేదా కలిసే అవకాశం కలుగలేదని అన్నారు. వీరి విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగవచ్చని సమాచారం. వీరిని మహబూబ్ నగర్ కోర్టుకు తీసుకెళ్లాలంటే కష్టమని అటు జైలు అధికారులు, ఇటు పోలీసులు భావిస్తుండటమే దీనికి కారణం.

Charlapalli
Jail
Disa
Hi-Security
Sucide
  • Loading...

More Telugu News