Chandrababu: చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు, చెప్పుల దాడి... కేసు విచారణకు సిట్ ఏర్పాటు!

  • ఇప్పటికే సుమోటోగా రెండు కేసులు నమోదు
  • ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో సిట్
  • వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు

గత వారంలో అమరావతి పర్యటనకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లిన వేళ, ఆయన కాన్వాయ్ పై రాళ్లు, చెప్పులు విసిరి దాడికి పాల్పడిన కేసుల విచారణను సిట్‌ కు అప్పగించినట్లు సౌత్‌ కోస్టల్‌ జోన్‌ ఐజీ వినీత్‌ బ్రిజ్‌ లాల్‌ వెల్లడించారు. గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో ఈ బృందాన్ని నియమించామని, వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించామని అన్నారు.

చంద్రబాబు పర్యటనకు అనుమతి ఉందని, 238 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పిన ఆయన, నిరసనకారుల్లో ఓ వ్యక్తి చిన్న రాయిని, మరో వ్యక్తి చెప్పును విసిరాడని అన్నారు. అంతకుముందే బస్సు అద్దాలకు పగుళ్లు ఉన్నాయని, రాయి తగలడంతో అవి మరింతగా పెరిగాయని బ్రిజ్ లాల్ తెలిపారు. పోలీసులు లాఠీ విసిరినట్టు ఆధారాలు లేవని చెప్పారు.

రాళ్ల దాడి విషయంలో తమకు ఫిర్యాదు అందకముందే సుమోటోగా కేసులను పెట్టామని చెప్పు విసిరిన వ్యక్తి, మందడం గ్రామానికి చెందిన భాస్కరరావుకాగా, రాయి విసిరింది ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన శృంగారపతి సందీప్ అని గుర్తించామని, వారికి ఇప్పటికే నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఇదే పర్యటనలో పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్ లను వాడటంపైనా కేసు నమోదు చేశామని అన్నారు.

  • Loading...

More Telugu News