Delhi: ప్రయాణికుల్లో ఉన్న నిపుణుడితో అత్యవసర పరిస్థితుల్లో విమానం నడిపించిన ఇండిగో
- ఢిల్లీలో పొగమంచు
- నిపుణుడైన పైలెట్ లేకుండా ఇండిగో విమానం ప్రయాణానికి సిద్ధం
- ప్రయాణికుల్లోనే ఓ పైలెట్ ఉన్నాడని గుర్తించిన ఇండిగో
పుణే నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీలో తీవ్రస్థాయిలో ఉన్న పొగమంచు కారణంగా విమానం నడిపేందుకు నిపుణుడైన పైలెట్ కావాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా క్యాట్-3 బి శిక్షణ పొందిన పైలెట్లు విమానాన్ని సమర్థంగా నడిపించగలరు. కానీ, పుణే నుంచి ఢిల్లీ ప్రయాణిస్తున్న విమానంలో కెప్టెన్ కు ఈ తరహా శిక్షణ లేదు. అతని కోపైలెట్ కు క్యాట్-3 బి సామర్థ్యం ఉన్నా, ఇద్దరు పైలెట్లు కూడా ఈ తరహా నిపుణులై ఉండాలన్నది నిబంధన.
దాంతో అదే విమానంలో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణం చేస్తున్న ఓ కెప్టెన్ ను విమానం నడపాల్సిందిగా ఇండిగో ఎయిర్ లైన్స్ యాజమాన్యం ఆదేశించింది. ఆ కెప్టెన్ కూడా ఇండిగో ఉద్యోగే. ఢిల్లీ నుంచి పుణే వెళ్లే విమానానికి కెప్టెన్. డ్యూటీ ముగియడంతో సాధారణ ప్రయాణికుడిలా తమ సంస్థకు చెందిన విమానంలోనే ఢిల్లీ తిరిగి వస్తున్నాడు. ఢిల్లీలో పొగమంచు కారణంగా విమాన ప్రయాణానికి తీవ్ర ఆటంకం ఏర్పడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తన సేవలు అందించాడు.
కాక్ పిట్ లోకి అనుమతించే ముందు అతడికి బ్రీత్ అనలైజర్ టెస్టులు నిర్వహించారు. అప్పటికప్పుడు అన్ని అనుమతులు సంపాదించారు. ఎందుకంటే ప్రయాణికుల్లో ఉన్న వ్యక్తి విమానం కాక్ పిట్ లోకి ప్రవేశించడం నేరం! అన్ని క్లియరెన్సులు వచ్చాక ఆ కెప్టెన్ సజావుగా విమానాన్ని నడిపి గమ్యస్థానం చేర్చినట్టు తెలుస్తోంది.