Uttar Pradesh: ఏబీసీడీలు రాని ఇంగ్లిష్ టీచర్.. విస్తుపోయిన మేజిస్ట్రేట్!

  • ఉత్తరప్రదేశ్‌లోని ఓ స్కూల్‌ను సందర్శించిన మేజిస్ట్రేట్
  • రెండు లైన్లు కూడా చదవలేక చేతులెత్తేసిన ఇంగ్లిష్ టీచర్ 
  • యూపీ విద్యావిధానానికి మచ్చుతునక అంటున్న నెటిజన్లు

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ పాండేకు విస్తుపోయే ఘటన ఒకటి ఎదురైంది. సికిందరాపూర్ సరాయిసి ప్రాంతంలో ఉన్న పాఠశాలను మేజిస్ట్రేట్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఓ తరగతి గదిలోకి వెళ్లిన ఆయన ఇంగ్లిష్ పాఠ్యపుస్తకం తీసి అందులోని రెండు లైన్లు చెప్పి చదవాలని విద్యార్థులను కోరారు. చదివేందుకు వారు కష్టపడుతుండడంతో ఆ పుస్తకాన్ని నేరుగా వారికి పాఠాలు చెప్పే ఇంగ్లిష్ టీచర్‌కు ఇచ్చి చదవమన్నారు.

ఆ పుస్తకాన్ని తీసుకున్న టీచర్ గుటకలు మింగడాన్ని మేజిస్ట్రేట్ గమనించారు. ఒక్క లైను కూడా చదవలేక చేతులెత్తేయడంతో మేజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సర్దిచెప్పుకునేందుకు ప్రయత్నించగా పాండే మరింత మండిపడ్డారు. తానేమీ అనువదించమనలేదని, కేవలం చదివి చెప్పమని మాత్రమే అన్నానంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమెకే ఇంగ్లిష్ చదవడం రాకుంటే పిల్లలకు ఏం చెబుతుందన్న మేజిస్ట్రేట్ ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో విద్యావిధానం ఎంత దయనీయ స్థితిలో ఉందో చెప్పడానికి ఇంతకుమించిన ఉదాహరణ అవసరం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News