Maharashtra: ఓపక్క ఉద్ధవ్ థాకరే బలపరీక్ష.. మరోపక్క బీజేపీ ఎంపీతో అజిత్ పవార్ భేటీ!
- చర్చనీయాంశంగా మారిన అజిత్ తీరు
- స్పందించి వివరణ ఇచ్చిన అజిత్
- మర్యాదపూర్వకంగానే కలిశానని వ్యాఖ్య
- తమ మధ్య స్నేహ సంబంధాలున్నాయని సమాధానం
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఈ రోజు మధ్యాహ్నం శాసనసభలో బలపరీక్ష ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ప్రతాప్‌రావు చికాలికర్‌తో ఎన్సీపీ నేత అజిత్ పవార్ సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే బీజేపీతో చేతులు కలిపి మళ్లీ సొంత గూటికి చేరుకున్న అజిత్.. మరోసారి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతాప్‌రావుతో భేటీపై అజిత్ పవార్ స్పందించి ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని అంటున్నారు. ప్రతాప్ రావుది వేరే పార్టీ అయినప్పటికీ, తమ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నేటి బలపరీక్షపై ఆయనతో ఎటువంటి చర్చ జరగలేదని తెలిపారు. కాగా, బలపరీక్షలో తాము సులువుగా గెలుస్తామని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు 162 మంది సభ్యుల బలం ఉందని ఆ కూటమి ఇప్పటికే స్పష్టం చేసింది.