Ambati Rambabu: రాజధాని అమరావతిపై చంద్రబాబు చేసిందేమీలేదు: వైసీపీ ఎమ్మెల్యే అంబటి
- అమరావతిపై ప్రేమ ఉంటే అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకోలేదు?
- రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై అన్యాయంగా కేసులు పెట్టారు
- అమరావతి అక్రమాలపై విచారణ కమిటీ వేశాం
టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని అమరావతి నిర్మాణంపై చేసిందేమిటని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. అమరావతిపై ప్రేమ ఉంటే అక్కడ ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. రాజధానిలో ఇల్లే కట్టలేని వ్యక్తి ఇక రాజధానిని ఏం నిర్మిస్తాడని విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
రాజధాని విషయంలో చంద్రబాబు అనేక మోసాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఏ దేశం వెళ్తే ఆ దేశ రాజధాని తరహాలో రాజధాని నిర్మిస్తామని అబద్ధాలు చెప్పారన్నారు. రాజధానిలోని రైతులపైనా, రియల్ ఎస్టేట్ వ్యాపారులపైనా అన్యాయంగా కేసులు పెట్టారని, అందుకే వాళ్లు కడుపు మంటతో నిరసన తెలిపారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో వివాదం చేయాలని ప్రతిపక్షనేత చంద్రబాబు చూస్తున్నారని, కోడెల శివప్రసాద్‌రావు మరణం, ఇసుక విషయంలో కూడా ఇలాగే చేశారని ఆయన విమర్శించారు. అమరావతిని చంద్రబాబు ఒక భ్రమరావతిగా మార్చాడని, రాజధానిలో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ కమిటీ వేశామని స్పష్టం చేశారు.
రాజధానిలో రూపాయి ఖర్చు చేసి పది రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించారని దుయ్యబట్టారు. అమరావతి అద్భుతమైన రాజధాని అయితే శాశ్వత బిల్డింగ్‌లు ఎక్కడ ఉన్నాయని, అసలు అమరావతిలో ఏం కట్టించారని నిలదీశారు. గతంలో ప్రధాని నరేంద్రమోదీ వస్తే నల్ల రిబ్బన్ బ్యానర్లు, ఫ్లెక్సీలతో నిరసన తెలిపిన చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకు సాష్టాంగ నమస్కారం పెట్టారని ప్రశ్నించారు. మోదీకి భయపడి పెట్టారా? అని ప్రశ్నిస్తూ.. బాబు ఎన్ని నమస్కారాలు పెట్టినా ప్రజలు నమ్మరని తెలిపారు.