Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్ గేటు దగ్గర్లో పైపుల చోరీ... నిందితుల అరెస్ట్
- గేటు నంబర్ 23, 24 వద్ద చోరీ
- పైపులను ఎత్తుకెళ్లిన దొంగలు
- నలుగురు దొంగలను రిమాండ్ కు తరలించిన పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ఘటన చోటు చేసుకుంది. సాక్షాత్తు రాష్ట్రపతి భవన్ గేటు దగ్గర్లోనే చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే, జోర్ బాగ్ ప్రాంతం నుంచి రాష్ట్రపతి భవన్ కు పైపులు వేసేందుకు గేటు నంబర్ 23, 24 వద్ద అరుణ్ జైన్ అనే కాంట్రాక్టర్ పైపులు ఉంచాడు. ఈ పైపులను దొంగలు ఎత్తుకెళ్లారు. జరిగిన ఘటనపై పోలీసులకు అరుణ్ జైన్ ఫిర్యాదు చేశాడు. దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది.
ఆజంఘడ్ ప్రాంతానికి చెందిన అజయ్ అనే వ్యక్తి పైపులు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. రాకేశ్ తివారీ, గుడ్డు ఖాన్, మిథిలేశ్ అనే వ్యక్తులతో కలిసి చోరీ చేసిన అజయ్... వాటిని మీరట్ నగరంలో విక్రయించినట్టు తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... వారిని రిమాండ్ కు తరలించారు.