Uddhav Thackeray: ఎందుకు భయపడుతున్నారు? మీ సొంత ఎమ్మెల్యేలనే ఎందుకు నమ్మడం లేదు?: థాకరేకు ఫడ్నవీస్ సూటి ప్రశ్న
- బలాన్ని ఎలా నిరూపించుకోవాలనే కేబినెట్ మీటింగ్ లో చర్చించారు
- కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పుడు భయం ఎందుకు?
- ప్రొటెం స్పీకర్ ను మార్చేందుకు యత్నిస్తున్నారు
మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేసిన దేవేంద్ర ఫడ్నవీస్... తాజా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై దాడిని మొదలు పెట్టారు. థాకరే నిన్న సాయంత్రం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే... తన తొలి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంపై ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు.
బలపరీక్షలో బలాన్ని ఎలా నిరూపించుకోవాలనే అంశంపైనే కేబినెట్ భేటీలో చర్చించారని... తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతుల సమస్యలపై ఏమాత్రం చర్చ జరగలేదని విమర్శించారు. బలనిరూపణకు కావాల్సినంత మెజార్టీ ఉన్నప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రొటెం స్పీకర్ ను కూడా మార్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఫడ్నవీస్ వరుస ట్వీట్లు చేశారు.
మీ సొంత ఎమ్మెల్యేలను కూడా ఎందుకు నమ్మలేకపోతున్నారని థాకరేను ఫడ్నవీస్ ప్రశ్నించారు. వారిని ఎందుకు నిర్బంధిస్తున్నారని అడిగారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని స్పష్టం చేసినప్పటికీ ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రశ్నలన్నింటికీ మహారాష్ట్ర సమాధానాలను తెలుసుకోవాలనుకుంటోందని చెప్పారు.
మరోవైపు, ముంబైలోని వివిధ హోటళ్లలో తమ ఎమ్మెల్యేలను శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఉంచాయి. వారెవరూ బయటకు రాకుండా పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే, ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు.