Rohit Sharma: రోహిత్ శర్మ ఆదాయం ఏడాదికి ఎంతో చూడండి!
- సూపర్ ఫామ్ లో ఉన్న రోహిత్
- ఒప్పందాల కోసం కంపెనీల ఉత్సాహం
- ఈ సీజన్ లో 10 కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్న రోహిత్ శర్మ
టీమిండియా డాషింగ్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ తన కెరీర్ లోనే అత్యద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఏ ఫార్మాట్ లో చూసినా రోహిత్ బ్యాట్ నుంచి పరుగులు వెల్లువెత్తుతున్నాయి. దాంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న నానుడిని ఈ ముంబయి హిట్ మ్యాన్ అక్షరాలా అమలు చేస్తున్నాడు. భార్య రితికా సజ్దే సహకారంతో అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ క్రికెటేతర మార్గాల్లోనూ భారీగా ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ప్రచారం చేస్తున్న బ్రాండ్ల సంఖ్య 22. ఏడాదికి రూ.75 కోట్ల వరకు సంపాదిస్తున్నట్టు మార్కెట్ వర్గాలంటున్నాయి.
ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ ముందు ఓ మోస్తరు మార్కెట్ వాల్యూ కలిగిన రోహిత్, ఆ మెగాటోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో వాణిజ్య ప్రకటనలు, ప్రచార ఒప్పందాల కోసం కంపెనీలు బారులు తీరాయి. ఈ ఒక్క సీజన్ లోనే రోహిత్ శర్మ 10 కొత్త ఒప్పందాలు చేసుకున్నాడంటే అతడి విలువ ఏంటో అర్థమవుతోంది. ఈ తరహా సంపాదనలో రోహిత్ శర్మ కంటే పైన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ఉన్నారు.
టీమిండియా సారథిగా అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా, వ్యక్తిగతంగానూ రికార్డుల మోత మోగిస్తున్న కోహ్లీ ఏడాదికి దాదాపు రూ.200 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. ఇక ఎంఎస్ ధోనీ సైతం గణనీయంగానే ఆర్జిస్తున్నాడు. ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ కావడంతో ధోనీ మార్కెట్ విలువ మెరుగ్గానే ఉంది.