Maharashtra: ఉద్ధవ్ సీఎం అయినా... పవర్ ఆదిత్య చేతుల్లోనే?
- నేడు సీఎంగా ఉద్ధవ్ ప్రమాణం
- షాడో సీఎం ఆదిత్యేనంటున్న శివసేన వర్గాలు
- ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా ఉంటారని వ్యాఖ్య
రాజ్ థాకరే ఫ్యామిలీలో తొలిసారిగా ఓ వ్యక్తి నేడు మహారాష్ట్రకు సీఎం కానున్నారు. ఆయనే ఉద్ధవ్ థాకరే. వాస్తవానికి ఆయన సీఎం పదవిని కోరుకోలేదు. తన కుమారుడు ఆదిత్యను ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కన్నారు. కానీ, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయనే సీఎంగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. మంత్రి వర్గ కూర్పులో ఆదిత్య థాకరేకు స్థానం లభించే పరిస్థితి కనిపించలేదు.
ఇక సీఎంగా ఉద్ధవ్ ఉన్నప్పటికీ, షాడో సీఎం మాత్రం ఆదిత్య యేనని, ఆయన కేంద్రంగానే పవర్ నడుస్తుందని అంటున్నారు శివసేన నేతలు. ఆదిత్యను భావి సీఎంను చేయాలన్నదే ఉద్ధవ్ లక్ష్యమని, అందుకు తగ్గట్టుగా ఆదిత్య అనుభవాన్ని సంపాదించుకునేలా ఉద్ధవ్ వ్యూహాలను రచిస్తారని చెబుతున్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పదవులు ఇవ్వరాదన్న నిర్ణయం కారణంగానే ఆదిత్యకు మంత్రివర్గంలో స్థానం లభించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయినప్పటికీ, ఆదిత్య పార్టీలో, ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తారని అంటున్నాయి.
ముంబైలోని వర్లీ నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థిగా విజయం సాధించిన ఆదిత్య, బుధవారం నాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.