Crime News: బిడ్డ కోసం తపించిన పిచ్చితల్లి హత్య మిస్టరీ వీడింది!
- సమీప బంధువే ప్రధాన నిందితుడు...సాయపడిన మరో ముగ్గురు
- తొలుత ఇంజక్షన్ ఇచ్చి మత్తులోకి
- అనంతరం గొంతునులిమి హత్య
గుంటూరు జిల్లా వినుకొండ మండలం జయపురం వద్ద నాలుగు నెలల క్రితం జరిగిన గుర్తు తెలియని మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మతిస్థిమితం లేకున్నా అమ్మ ప్రేమను అదుపు చేసుకోలేక బిడ్డకోసం తల్లడిల్లిన ఆ తల్లిని ఆర్ఎంపీ వైద్యుడైన సమీప బంధువు, మరో ముగ్గురు కలిసి చంపేసినట్లు తేల్చారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెదకూరపాడుకు చెందిన రాయపూడి సునీత (24)కు మతిస్థిమితం లేదు. నాలుగేళ్ల క్రితం ఆమె ఓ ఆడబిడ్డకు జన్మనివ్వగా మహిళా శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. అనంతరం ఆ పిచ్చితల్లిపై ఎవరో అత్యాచారానికి పాల్పడడంతో ఆమె రెండోసారి గర్భవతి అయి నాలుగు నెలల ముందు మగబిడ్డకు జన్మనిచ్చింది.
నరసరావు పేటలో ఉంటున్న సునీత సమీప బంధువు, ఆర్ఎంపీ వైద్యుడు అయిన సికినం వెంకటేశ్వర్లు ఆ బిడ్డను స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం ప్రకాశం జిల్లా తంగేడుమల్లికి చెందిన వెంకట్రావు వద్ద రూ.3 లక్షలు తీసుకుని పెంపకానికి ఇచ్చేశాడు.
కొన్ని రోజుల తర్వాత సునీత వెంకటేశ్వర్లు వద్దకు వచ్చి తన బిడ్డను ఇవ్వాలంటూ గొడవ చేయడం మొదలు పెట్టింది. రోజు రోజుకీ ఆమె గొడవ ఎక్కువ కావడం, బిడ్డను తెచ్చిచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆమెను చంపేస్తే సమస్య తీరిపోతుందని వెంకటేశ్వర్లు భావించాడు. అవసరమైన స్కెచ్ వేశాడు.
ఇందులో భాగంగా ఆసుపత్రికి వచ్చిన ఆమెకు మత్తుమందు ఇచ్చాడు. అనంతరం మెడికల్ షాపు యజమాని పులిపాటి రాజశేఖర్ రెడ్డి, గుంటూరుకు చెందిన సొంబట్టి వీరాంజనేయులు, నరసరావు పేటకు చెందిన సిరంగి శ్రీనివాసరావుల సాయంతో ఆమెను కారులో తీసుకు వెళ్తూ చున్నీ మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్యచేశారు.
అనంతరం మృతదేహాన్ని గుండ్లకమ్మ నదిలో పడేయాలని తీసుకువెళ్తుండగా జయపురం వద్ద కారు బురదలో కూరుకుపోయింది. ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అక్కడే తుప్పల్లో మృతదేహాన్ని పడేసి వచ్చేశారు. జూలై 9న స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గుర్తు తెలియని మహిళ హత్య కేసుగా పోలీసులు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.