Andhra Pradesh: 'మీడియా'పై జీవో నిలుపుదలకు ఏపీ హైకోర్టు నిరాకరణ!
- అక్టోబరు 30న జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- నిలుపుదల చేయాలంటూ పిల్ దాఖలు చేసిన హైదరాబాద్ జర్నలిస్ట్
- రద్దు అయిన జీవోను ఎందుకు ప్రస్తావించారో చెప్పలంటూ ప్రభుత్వానికి ఆదేశం
నిరాధార వార్తలు రాసే మీడియా సంస్థలపై కేసులు పెట్టేందుకు వీలుగా ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 2430ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, రద్దు అయిన జీవో 938ను జీవో 2430లో రిఫరెన్స్‌గా ఎందుకు పేర్కొన్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అక్టోబరు 30న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది ఎం.వేణుమాధవ్ వాదనలు వినిపిస్తూ.. జీవో 2430 జర్నలిస్టుల తలపై కత్తిలా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన న్యాయస్థానం జీవోలో తప్పేముందని, దీనివల్ల మీరెలా ప్రభావితులవుతారని ప్రశ్నించింది. జీవోను నిలుపుదల చేసేందుకు నిరాకరించింది. ప్రభుత్వ వాదనలు ఇవ్వకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది.