Maharashtra: మహారాష్ట్రలో కొలిక్కి వచ్చిన మంత్రి పదవుల పంపకం!
- 16-15-13 ఫార్మూలాకు మూడు పార్టీలు ఓకే
- ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఉపముఖ్యమంత్రి పదవి?
- స్పీకర్ పదవిపై పట్టుబట్టరాదని కాంగ్రెస్ నిర్ణయం?
మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడీ’ కూటమి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం రేపు కొలువుదీరనుంది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలైన శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య మంత్రి పదవుల పంపకం ఒక కొలిక్కి వచ్చింది. 16-15-13 ఫార్మూలాకు మూడు పార్టీలు ఓకే చెప్పాయి.
ఇది ఇలా ఉండగా, సభాపతి పదవిపై పట్టుబట్టరాదని కాంగ్రెస్ నిర్ణయించింది. పదవుల పంపకంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మల్లికార్జున ఖర్గే చర్చలు కొనసాగించారు. శివసేనకు 16, ఎన్సీపీకి 15, కాంగ్రెస్ 13 మంత్రి పదవులు పంచుకునేందుకు కూటమి పార్టీలు ఓకే చెప్పాయి. ఇదిలావుండగా, తమ శాసనసభాపక్ష నేత బాధ్యతలు మళ్లీ అజిత్ పవార్ కు అప్పగించే యోచనలో ఎన్సీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉపముఖ్యమంత్రి పదవి కూడా అజిత్ పవార్ కే దక్కనుందని సమాచారం.