Kodali Nani: రాజధానిలో కుక్కలు, గొర్రెలు, దున్నపోతులు తిరుగుతున్నాయి... వాటితోపాటే చంద్రబాబు కూడా తిరుగుతాడు: కొడాలి నాని
- చంద్రబాబునాయుడిపై కొడాలి నాని ఫైర్
- అమరావతి పర్యటనపై విమర్శలు
- ఓటమిపై సమీక్ష చేసుకోవాలని హితవు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటిస్తుండడం పట్ల ఏపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించారు. రాజధానిలో ప్రస్తుతం కుక్కలు, గొర్రెలు, మేకలు, దున్నపోతులు తిరుగుతున్నాయని, ఎల్లుండి చంద్రబాబు కూడా వాటితో పాటే రాజధానిలో తిరుగుతారని ఎద్దేవా చేశారు. అయినా, చంద్రబాబు ఉండేది రాజధానిలోనే కదా, మరి ఎక్కడినుంచో చంద్రమండలం నుంచి వచ్చినట్టు అమరావతిలో పర్యటిస్తానని సొల్లు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. రాజధానిలో నాలుగు భవనాలు, తుప్పలు, ముళ్లపొదలు తప్ప మరేమీ లేదని అన్నారు.
చంద్రబాబునాయుడ్ని నేలకేసి కొట్టి 23 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదని విమర్శించారు. చంద్రబాబునాయుడు ఓ సన్నాసి అని, ఉదయం లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు అమరావతిపై సమీక్షలు, గ్రాఫిక్స్ రిలీజ్ చేయడం, మధ్యాహ్నం నుంచి పోలవరంపై సమీక్షలు, ఒక్క శాతమో, పావు శాతమో పని జరిగిందని చెప్పడం ఇలా ఆ రెండు అంశాలు తప్ప ఇంకేమీ పట్టించుకోలేదన్నారు.
"ఐదు, పదివేలకు, రెండు పలావు పొట్లాలకు, పాతిక లీటర్ల డీజిల్ కు పనిచేసేవాళ్లు కాకుండా కాస్త బుర్ర పనిచేసేవాళ్లను పనిలో పెట్టుకుని ఓటమిపై రివ్యూ చేసుకోవాలి. నీకు, నీ కొడుక్కి బుర్ర పనిచేయదు కాబట్టి బుర్ర ఉన్న నలుగుర్ని ఏరుకుని సమీక్ష చేసుకోండి. జగన్ ఇంత చిన్నవాడైనా అంత క్రేజ్ ఎందుకు వచ్చింది, ఇంత అనుభవం ఉండి కూడా మనం ఎందుకు సంకనాకి పోయాం అని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి, పోలవరం... ఓడిపోయి విపక్షంలో ఉన్నప్పుడు కూడా అమరావతి, పోలవరమేనా!
మాకు పోలవరం, అమరావతి మాత్రమే కాదు 13 జిల్లాలు కూడా ఎంతో ముఖ్యం. జగన్ సీఎం పీఠం ఎక్కి ఆర్నెల్లు కూడా కాలేదు. అప్పుడే ఆయనపై బురదజల్లడం తగదు. మేం ఏదన్నా అంటే బూతులు తిడుతున్నారంటూ చంద్రబాబు ఏడుస్తున్నారు. ఆర్నెల్లో కనీసం ఓ ఇల్లు కూడా కట్టలేం. జగన్ కు కాస్త టైము ఇవ్వాలి. అలాకాకుండా, జగన్ నువ్వో సైకో, జగన్ నువ్వో దుర్మార్గుడివి, బాబాయిని చంపావు అంటూ ఆరోపణలు తప్ప వైఎస్సార్ సమకాలికుడవని చెప్పుకునే నువ్వు ఏనాడైనా సానుకూల ధోరణితో సలహాలు ఇచ్చావా!" అంటూ నిప్పులు చెరిగారు.