Paruchuri: 'జార్జి రెడ్డి' చూశాక ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు: పరుచూరి గోపాలకృష్ణ
- 'జార్జి రెడ్డి' నాకు పరిచయమే
- కొన్ని సంఘటనలకు నేను కూడా సాక్షినే
- 'జార్జి రెడ్డి'తో పాటు అప్పటి సన్నిహితులు గుర్తొచ్చారన్న పరుచూరి
ఈ నెల 22వ తేదీన 'జార్జి రెడ్డి' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విద్యార్ధి నాయకుడైన 'జార్జి రెడ్డి' చుట్టూ .. ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తాజాగా ఈ సినిమాను గురించి 'పరుచూరి పలుకులు' ద్వారా పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు.
"నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు 'జార్జి రెడ్డి'తో పరిచయం ఏర్పడింది. ఈ సినిమాను రిలీజ్ రోజునే చూశాను .. ఆ రోజులను దర్శకుడు కళ్లకి కట్టినట్టుగా చూపించాడు. దర్శకుడు ముందుగా చెప్పినట్టు చాలా కల్పిత దృశ్యాలు వున్నాయి. ఆయన చూపించినట్టుగా కొన్ని సంఘటనలు ఉస్మానియా క్యాంపస్ లో జరిగినవే. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలకు నేను కూడా సాక్షినే.
'జార్జి రెడ్డి' చనిపోయినప్పుడు నేను తిరుపతిలో వున్నాను. ఎక్కువసార్లు పలకరించుకుంటూ .. భావజాలాన్ని పంచుకుంటూ ఉండేవాళ్లం కనుక, ఈ వార్త వినగానే నాకు చాలా బాధ కలిగింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు అప్పటి రోజులు నా కళ్లముందు మెదిలాయి. సినిమా చూసి వచ్చి పడుకుంటే, 'జార్జి రెడ్డి'తో పాటు అప్పటి సన్నిహితులు గుర్తొచ్చి ఆ రాత్రి నిద్రపట్టలేదు" అని చెప్పుకొచ్చారు.