Telugudesam: ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు: వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి

  • మొన్నటి ఎన్నికల్లో గెలవలేకపోయారు
  • ఇక జమిలి ఎన్నికలొస్తే గెలుస్తారట
  • మళ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీకి ఒక్క సీటూ రాదు  

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొన్నటి ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తిరస్కరించినా చంద్రబాబుకు బుద్ధి రాలేదని అన్నారు. చిత్తుగా ఓడిపోయారని, ఇంకా జమిలి ఎన్నికల గురించి కడపలో ఆయన మాట్లాడుతున్నారని, చంద్రబాబుకు మతి భ్రమించడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.

'మొన్నటి ఎన్నికల్లో గెలవలేకపోయారు, ఇక జమిలి ఎన్నికలొస్తే గెలుస్తారట' అంటూ బాబుపై సెటైర్లు విసిరారు. మళ్లీ ఎన్నికలు జరిగితే కనుక టీడీపీకి ఒక్క సీటు కూడా రాదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా సహా రాయలసీమ జిల్లాల ప్రజలందరూ చంద్రబాబును ఛీత్కరించుకున్నారని, అయినా పట్టించుకోకుండా కడప జిల్లాలో మళ్లీ అడుగుపెట్టారని విమర్శించారు. 'ఏ రాజకీయ నాయకుడు ఏ ప్రాంతం గురించీ అవమానకర రీతిలో మాట్లాడరు కానీ, నువ్వు (చంద్రబాబు), నీ దత్తపుత్రుడు (పవన్ కల్యాణ్) రాయలసీమను పదేపదే అవమానించినట్టు మాట్లాడుతున్నారు’ అని ధ్వజమెత్తారు. ఇలాంటి మాటలు మాట్లాడిన వీళ్లిద్దరూ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Telugudesam
Chandrababu
YSRCP
srikanth reddy
  • Loading...

More Telugu News