Devendra Fadnavis: శివసేన హిందూత్వం సోనియాగాంధీ ముందు మోకరిల్లింది: ఫడ్నవీస్ తీవ్ర విమర్శలు
- ప్రజల తీర్పును శివసేన అపహాస్యంపాలు చేసింది
- సీఎం పదవి కోసం ఇతర పార్టీలతో చేతులు కలిపింది
- బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతాం
మహారాష్ట్రలో రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ముచ్చట మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. బలపరీక్షను ఎదుర్కోవడానికి కావాల్సినంత సంఖ్యాబలం లేకపోవడంతో... ముఖ్యమంత్రి పదవికి ఫడ్నవీస్ ఒక రోజు ముందే రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, శివసేనపై నిప్పులు చెరిగారు. బీజేపీ-శివసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రజల తీర్పును శివసేన అపహాస్యంపాలు చేసిందని మండిపడ్డారు. అన్ని స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. తమతో కలసి పోటీ చేస్తేనే ఎక్కువ సీట్లను గెలుచుకోవచ్చని, తద్వారా అధికారాన్ని పంచుకోవచ్చని శివసేన ఆలోచించిందని తెలిపారు.
ఏమాత్రం అవకాశం లేని, న్యాయబద్ధం కాని అంశంపై శివసేన పట్టుబట్టిందని ఫడ్నవీస్ మండిపడ్డారు. సీఎం కావాలనే యోచనతో ఇతర పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టిందని విమర్శించారు. శివసేన హిందూత్వం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముందు మోకరిల్లిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా చేశారని... దీంతో, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం తమకు లేదని ఫడ్నవీస్ తెలిపారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఇంతకాలం మహారాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలను తెలుపుతున్నానని చెప్పారు. ఇకపై ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతామని తెలిపారు.