Nara Lokesh: బొత్స గారికి అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తో తేలిపోయింది: నారా లోకేశ్
- ఇన్నాళ్లూ బొత్సగారి మెదడు అరికాల్లో ఉందని అనుకున్నాను
- అమరావతిని శ్మశానంతో పోల్చి అవమానపరుస్తున్నారు
- బొత్సగారికి తెలియదు, చెప్పినా అర్థం కాదు
- వైకాపా నేతలు కూర్చున్న చెట్టునే నరికేసుకుంటున్నారు
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'బాబూ.. ఎందుకా శ్మశానానికి?' అంటూ ఓ దినపత్రికలో వచ్చిన వార్తను లోకేశ్ పోస్ట్ చేశారు. 'రాజధానిని ఎన్నాళ్లకు కడదామనుకున్నారు? రైతుల భూమిలో అభివృద్ధి ఏది?' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై బొత్స చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.
'ఇన్నాళ్లూ బొత్సగారి మెదడు అరికాల్లో ఉందని అనుకున్నాను. అసలు మెదడే లేదని నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తో తేలిపోయింది. శ్మశానాలకు పార్టీ రంగులు వేసుకుంటున్న జగన్ గారు అక్కడే ఆగిపోతారని ఊహించలేదు. అందుకే అమరావతిని శ్మశానంతో పోల్చి ప్రజా రాజధానిని అవమానపరుస్తున్నారు' అని లోకేశ్ విమర్శించారు.
'బొత్సగారికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి పడిన కష్టం వైకాపా నాయకులకు అర్థం అవుతుంది అనుకోవడం అత్యాశే అవుతుంది. ల్యాండ్ పూలింగ్ దగ్గర నుండి, రైతుల ప్లాట్లు తిరిగి ఇవ్వడం, మౌలిక వసతుల కల్పన వరకూ అన్నీ దేశంలో ఉత్తమ ఆలోచనలుగా ప్రశంసలు అందుకుంటుంటే వైకాపా నేతలు మాత్రం కూర్చున్న చెట్టునే నరికేసుకుంటున్నారు' అని లోకేశ్ ట్వీట్ చేశారు.