Sabarimala: శబరిమలకు వచ్చిన బిందు అనే యువతి... ఆగ్రహంతో కారం చల్లిన అయ్యప్ప భక్తులు!
- కారం పడటంతో తీవ్ర అస్వస్థత
- ఊపిరి తీసుకోలేని పరిస్థితుల్లో బిందు
- ఆసుపత్రికి తరలింపు
కేరళలోని శబరిమల మరోసారి ఉద్రిక్త పరిస్థితుల్లోకి వెళ్లింది. బిందు అనే యువతి స్వామి దర్శనానికి రాగా, అయ్యప్ప భక్తులు కారం చల్లడంతో, ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే స్పందించిన పోలీసులు, ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిన్న మొన్నటి వరకూ పంబకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలక్కల్ వరకే భక్తులను అనుమతించిన పోలీసులు, పరిస్థితి ప్రశాంతంగా ఉందన్న భావనతో, పంబ వరకూ వాహనాలను అనుమతించడంతోనే ఈ ఘటన జరిగిందని సమాచారం.
ఓ ప్రైవేటు వాహనంలో పంబ వరకూ బిందు వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ ఆమె కారు దిగగానే, గమనించిన అయ్యప్ప భక్తులు, వెంటనే వెళ్లిపోవాలని కోరడం, దానికి ఆమె అంగీకరించక పోవడంతో ఈ ఘటన జరిగినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, అక్కడకు చేరుకునే సమయానికే బిందు ఊపిరి తీసుకోలేక అనారోగ్యానికి గురైంది.
కాగా, తాను ఎలాగైనా స్వామిని దర్శించుకుంటానని భూమాతా బ్రిగేడ్ కార్యకర్త తృప్తీ దేశాయ్ తాజాగా వ్యాఖ్యానించారు. ఆమె వస్తే రక్షణ కల్పించలేమని ఇప్పటికే కేరళ సర్కారు తేల్చి చెప్పింది. తృప్తీ దేశాయ్ డిసెంబర్ రెండో వారంలోగా శబరిమల దర్శించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె పర్యటనపై కచ్ఛితమైన సమాచారం తెలియనప్పటికీ, పోలీసులకు సమాచారం ఇచ్చి, ఆమె రానున్నట్టు తెలుస్తోంది.