Anil Ambani: అనిల్ అంబానీ ఆస్తి కోసం ముఖేష్ ప్రయత్నాలు... మధ్యలో పోటీగా సునీల్ మిట్టల్!
- పీకల్లోతు అప్పుల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్
- ఆస్తుల కోసం 11 కంపెనీల బిడ్డింగ్
- శుక్రవారం నాడు తెరవనున్న అధికారులు
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి దివాలా తీసిన అనిల్ అంబానీ సంస్థ ఆర్ కామ్ ఆస్తుల విక్రయానికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ మొదలైంది. ఆర్ కామ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు, అనిల్ అంబానీ సోదరుడైన ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సైతం పోటీలో ఉంది. జియోకు ప్రధానంగా సునీల్ భారతీ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్ టెల్ నుంచి గట్టి పోటీ వస్తోంది.
ఆర్ కామ్ తో పాటు రిలయన్స్ టెలికం, రిలయన్స్ ఇన్ ఫ్రాటెల్ సంస్థ ఆస్తులను విక్రయానికి ఉంచగా, మొత్తం 11 బిడ్స్ వచ్చాయి. జియో, ఎయిర్ టెల్ తో పాటు వర్డే క్యాపిటల్, యూవీ అసెట్ రీకన్స్ట్రక్షన్ తదితర కంపెనీలు కూడా బిడ్స్ దాఖలు చేశాయి. అయితే, ఆర్ కామ్, ఆప్టికల్ ఫైబర్ బిజినెస్ పై కన్నేసిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ కంపెనీ నుంచి బిడ్ రాకపోవడం గమనార్హం.
ఈ బిడ్లను రుణదాతల కమిటీ శుక్రవారం తెరవనుంది. ఆర్ కామ్ నెత్తిపై రుణాల భారం సుమారు రూ. 33 వేల కోట్లు ఉంది. వీటి చెల్లింపు కోసం ఆస్తులను విక్రయించాలని గతంలో ఆర్ కామ్ ప్రయత్నించినా కుదరలేదు.