Maharashtra: ఇది గోవా, మణిపూర్ కాదు... మహారాష్ట్ర!... బీజేపీకి మన తడాఖా ఏంటో చూపిద్దాం: శరద్ పవార్
- హోటల్ గ్రాండ్ హయత్ చుట్టూ తిరుగుతున్న 'మహా' రాజకీయం
- మూడు పార్టీల ఎమ్మెల్యేలతో కళకళలాడుతున్న గ్రాండ్ హయత్
- అజిత్ పవార్ కు విప్ జారీచేసే హక్కులేదన్న శరద్ పవార్
మహారాష్ట్ర రాజకీయాలు ముంబయి హోటల్ గ్రాండ్ హయత్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఆ హోటల్లోనే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. తమ కూటమికి 162 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉందని చెబుతున్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ, మహారాష్ట్రలో బీజేపీ అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆరోపించారు.
అజిత్ పవార్ నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని, అజిత్ పవార్ కు విప్ జారీచేసే హక్కులేదని, ఎన్సీపీ ఎమ్మెల్యేలను ఆదేశించలేరని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఎప్పుడు ఆదేశించినా బలప్రదర్శనకు తాము సిద్ధమేనని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని మండిపడ్డారు. 'ఎమ్మెల్యేలు ఎవరూ భయపడవద్దు. ఇది గోవా, మణిపూర్ కాదు... మహారాష్ట్ర! బీజేపీకి మరాఠా రుచి చూపించాల్సిన సమయం ఆసన్నమైంది' అని శరద్ పవార్ పిలుపునిచ్చారు.