Janasena: ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలతో ఒక తరం అన్యాయమైపోతుంది: నాదెండ్ల మనోహర్
- ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మాధ్యమాలు వుండాలి
- తెలుగు మాధ్యమాన్ని కచ్చితంగా కొనసాగించాలి
- ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తున్నాం
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టడానికి జనసేన పార్టీ వ్యతిరేకం కాదని, అయితే తెలుగు మాధ్యమాన్ని కచ్చితంగా కొనసాగించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం (పీఏసీ) అనంతరం నాదెండ్ల మాట్లాడుతూ, పీఏసీ సమావేశం సుదీర్ఘంగా జరిగిందని, ప్రధానంగా ఆరు అంశాలపై చర్చించినట్లు చెప్పారు.
ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇసుక విధానంపై చర్చ సాగిందని, ఈ రోజుకీ అనేక చోట్ల ఇసుక సరఫరాలో అవకతవకలు జరుగుతున్నాయని పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వార్తలు వస్తున్నాయని అన్నారు. జిల్లాల్లో జరుగుతున్న ఇసుక అవకతవకలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారని, ప్రతి ఒక్క జన సైనికుడు ఇసుక రవాణా సరిగా జరుగుతుందా? లేదా? సామాన్యుడికి ఇసుక చేరుతుందా? లేదా? అన్న దానిపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. ఇందుకు సంబంధించిన సమాచారం సేకరించి పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకొస్తే అవకతవకలపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మాధ్యమాలూ ఉండాలని, ఆంగ్ల భాషను విద్యార్థులపై బలవంతంగా రుద్దడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. 95 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా ప్రభుత్వం తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు ఒక తరానికి అన్యాయం చేసే విధంగా ఉన్నాయని విమర్శించారు.
మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ముఖ్యంగా ప్రభుత్వంపై మరింత ఉందని అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలు భావి తరాలకు అందించాలంటే మాతృభాషను కాపాడుకోవడం చాలా అవసరమని, దీనిపై జనసేన పార్టీ తరపున స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో రెండు మాధ్యమాలకు అవకాశం కల్పించాలని తెలుగు మాధ్యమంలో చదవడానికి ఒక్క విద్యార్ధి సిద్ధంగా ఉన్నా సరే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఆ విద్యార్ధిని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించినట్టు చెప్పారు. అలా కాకుండా ప్రభుత్వం మొండిగా ముందడుగు వేస్తే అన్ని పార్టీలను కలుపుకొని తెలుగు భాష పరిరక్షణ కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు.
పార్టీ కమిటీలపై నిర్దిష్ట మార్గదర్శకాలు
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 49 నదులు ఉన్నాయని, ఆ నదులకు గత వైభవం తీసుకొచ్చే విధంగా గొప్ప కార్యక్రమం రూపొందించామని అన్నారు. ఆ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రజల్లోకి తీసుకెళ్తామని, పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని పవన్ కల్యాణ్ ఆదేశించినట్టు చెప్పారు. నిర్దిష్ట మార్గదర్శకాలు ఇచ్చామని, డిసెంబర్ 15వ తేదీ కల్లా మండల, పట్టణ కమిటీలను పూర్తి చేసి ఆ ప్రతిపాదనలు పార్టీ కార్యాలయానికి పంపించాలని నియోజకవర్గ ఇంచార్జులను కోరినట్టు తెలిపారు. త్వరలోనే రాయలసీమ ప్రాంతంలో పవన్ కల్యాణ్ పర్యటిస్తారని, ఏ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.