Botsa Satyanarayana: మా విధానాలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి: ఏపీ మంత్రి బొత్స
- రైతు భరోసాపై విమర్శలు చేశారు
- ఇంగ్లీష్ మీడియంపై అనవసరంగా గందరగోళం సృష్టించారు
- ప్రజలు ఇంగ్లీష్ ను కోరుకోవడంతో యూ టర్న్ తీసుకున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు తమ విధానాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈ రోజు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ) పనులపై సమీక్ష జరిపిన తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడారు. 'రైతు భరోసా పథకంపై చంద్రబాబు విమర్శలు చేశారు. ఈ పథకం కింద అందించేది కేంద్రం డబ్బు అని ఆయన ఆరోపించారు. అయితే, ఆ తర్వాత, మేము చెప్పినదానికంటే మరో రూ.2000 ఎక్కువ ఇవ్వడంతో ఆయన విమర్శలు ఆపేశారు' అన్నారు.
అనంతరం ఇసుక సమస్యపై చంద్రబాబు విమర్శలందుకున్నారన్నారు. గత ప్రభుత్వం చేసిన ఇసుక పాలసీని తాము సంస్కరించాలనుకున్నామని చెపుతూ.. అదే చేశామన్నారు. అందరికీ విద్య అందించాలన్న లక్ష్యంతో సంస్కరణలు చేపట్టామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగును ఓ సబ్జెక్టుగా తప్పనిసరిచేస్తూ ప్రకటన చేశామన్నారు.
ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేశాయని, ప్రజలు మా నిర్ణయాన్ని స్వాగతించడంతో మళ్లీ వారు యూ టర్న్ తీసుకున్నారని అన్నారు. తెలుగు కావాలంటున్న ఈ ప్రతిపక్షాల నేతలు వారి పిల్లలను, మనవళ్లను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారని విమర్శించారు. సామాన్యులకు కూడా ఆంగ్ల విద్యను అందుబాటులోకి తేవాలనే తాము తాపత్రయపడుతున్నామని బొత్స స్పష్టం చేశారు.