Julian Assange: అసాంజే పరిస్థితి దారుణంగా వుంది.. జైల్లోనే చనిపోవచ్చు!: బహిరంగ లేఖ రాసిన 60 మంది డాక్టర్లు
- అసాంజేకు తక్షణమే మెరుగైన వైద్య చికిత్స అందించాలి
- ఆయన పరిస్థితిపై చాలా ఆందోళనగా ఉన్నాం
- ఆయనను బతికించుకునేందుకు ఎక్కువ సమయం లేదు
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంచలన నిజాలను వెలుగులోకి తీసుకొచ్చి, అగ్రరాజ్యం అమెరికాకు సైతం ముచ్చెమటలు పట్టించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓ బ్రిటీష్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. గూఢచర్య చట్టం కింద బ్రిటన్ నుంచి అసాంజేను తమ దేశానికి రప్పించేందుకు అమెరికా విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ చట్టం ప్రకారం అసాంజేపై ఉన్న ఆరోపణలు రుజువైతే ఆయనకు గరిష్టంగా 175 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో 48 ఏళ్ల అసాంజే ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏకంగా 60 మంది డాక్టర్లు బహిరంగ లేఖ రాశారు. బ్రిటన్ అంతర్గత శాఖకు చెందిన హోం సెక్రెటరీ ప్రీతి పటేల్ కు రాసిన ఆ బహిరంగ లేఖలో... ఆగ్నేయ లండన్ లో ఉండే బెల్మార్ష్ జైలు నుంచి ఏదైనా యూనివర్శిటీకి అనుసంధానంగా ఉండే హాస్పిటల్ కు అసాంజేను తరలించాలని డాక్టర్లు కోరారు.
జైల్లో అసాంజేను టార్చర్ కు గురి చేస్తున్నారని వైద్యులు తెలిపారు. న్యాయ విచారణ, దూషణ, టార్చర్ వల్ల అసాంజే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
'అసాంజే ఆరోగ్యంపై తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. అతని శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితులపై తక్షణమే వైద్య పరంగా ఓ అంచనాకు రావాల్సి ఉంది. అత్యున్నత వైద్య పరికరాలు, సిబ్బంది ఉన్న ఏదైనా యూనివర్శిటీకి అనుసంధానంగా ఉన్న హాస్పిటల్ లో ఆయనకు చికిత్ప అందించాలి. అసాంజే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జైల్లోనే ఆయన చనిపోవచ్చు. ఆయనను బతికించుకునేందుకు మనకు ఎక్కువ సమయం లేదు' అని వైద్యులు తమ లేఖలో పేర్కొన్నారు.
లేఖ రాసిన వారిలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, స్వీడన్, ఇటలీ, జర్మనీ, పోలాండ్, శ్రీలంక వైద్యులు ఉన్నారు. గత నెలలో కోర్టుకు హాజరైన సందర్భంగా అసాంజే చాలా బలహీనంగా కనిపించడంతో... ఆయన ఆరోగ్యంపై సర్వత్ర ఆందోళన నెలకొంది. కోర్టుకు హాజరైన సందర్భంగా తన పుట్టినరోజును కూడా అసాంజే చెప్పలేకపోయారు. మరో విషయం ఏమిటంటే... కోర్టు విచారణ ముగుస్తున్న సమయంలో కోర్టులో ఏం జరుగుతోందో కూడా తనకు అర్థం కావడం లేదని జడ్జికి అసాంజే చెప్పడం... ఆయన మానసికస్థితికి అద్దం పడుతోంది. దీంతో, ఆయన మానసిక స్థితిపై ఆందోళన మరింత ఎక్కువైంది.