Sharad Pawar: అజిత్ పవార్ మాటలు నమ్మొద్దు... ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు: శరద్ పవార్
![](https://imgd.ap7am.com/thumbnail/tn-05ba1f6a86e1.jpg)
- తానిప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నానన్న అజిత్ పవార్
- అజిత్ వ్యాఖ్యలు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకేనన్న శరద్ పవార్
- తాము శివసేన, కాంగ్రెస్ తోనే కూటమి కడతామని స్పష్టీకరణ
మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనా బలం నిరూపించుకోవాల్సి ఉండడం ఏంజరగబోతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. వీటన్నింటిని మించి ఎన్సీపీలో చీలిక తెచ్చిన అజిత్ పవార్ తానిప్పటికీ ఎన్సీపీలోనే ఉన్నానని, మహారాష్ట్రలో బీజేపీ-ఎన్సీపీ ప్రభుత్వం స్థిరమైన పాలన అందిస్తుందని ట్వీట్ చేసి మరో కలకలం రేపారు. దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెంటనే ప్రతిస్పందించారు.
బీజేపీతో ఎన్సీపీ చేతులు కలిపే ప్రసక్తే లేదని, అజిత్ పవార్ తన వ్యాఖ్యలతో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని స్పష్టం చేశారు. శివసేన, కాంగ్రెస్ పార్టీలతో కూటమిగా ఏర్పడేందుకు ఎన్సీపీ ఏకగ్రీవం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. అజిత్ పవార్ తప్పుడు ప్రకటనలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాడని, ఆయన వ్యాఖ్యల్లో నిజంలేదని అన్నారు.