Maharashtra: సుప్రీంకు చేరిన మహారాష్ట్ర రాజకీయం... ప్రభుత్వ ఏర్పాటుపై పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ
- మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు
- తమకు 144 మందికి పైగా మద్దతు ఉందన్న కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ
- తమకు అవకాశమిచ్చేలా గవర్నర్ ను ఆదేశించాలని విజ్ఞప్తి
మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీం కోర్టు గడప తొక్కాయి. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నిర్ణయించుకున్నాయి. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ ఈ మూడు పార్టీలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తమకు 144 మందికి పైగా మద్దతు ఉందని, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తమ మూడు పార్టీలను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరాయి.
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోవడంతో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఈ ఉదయం దేవేంద్ర ఫడ్నవీస్ తో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ నుంచి వేరుపడిన అజిత్ పవార్ వర్గం బీజేపీకి మద్దతు పలకడంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే.