Karvi stock broking compny Trading Halted: స్టాక్ బ్రోకింగ్ కంపెనీ కార్వీ సంస్థపై సెబీ నిషేధం
- ఎన్ఎస్ఈ విచారణ నివేదిక ఆధారంగా సెబీ నిర్ణయం
- రూ.1096 కోట్ల అక్రమ బదలాయింపులు జరిగాయని వెల్లడి
- మదుపుదారులకు టోకరా ఇచ్చిన స్టాక్ బ్రోకింగ్ సంస్థ
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ కార్వీ సంస్థపై సెక్యూరిటీ ఎక్చేంజ్ ఆఫ్ బోర్డు(సెబీ) నిషేధం విధించింది. క్లయింట్లకు చెందిన ఖాతాల్లో అవకతవకలు జరిగాయని ఎన్ఎస్ఈ తన విచారణలో తేల్చడంతో సెబీ ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఇక ముందు ట్రేడింగ్ చేయకూడదని కార్వీ సంస్థను ఆదేశించింది.
కార్వీ నిర్వాకంపై జనవరిలో ఫిర్యాదులు రాగా ఎన్ఎస్ఈ రంగంలోకి దిగి అవతవకలను వెలుగులోకి తెచ్చింది. క్లయింట్లకు సంబంధించిన దాదాపు రూ.2వేల కోట్లను దారి మళ్లించిందంటూ ఆరోపణల నేపథ్యంలో ఎన్ఎస్ఈ (నేషనల్ స్టాక్ ఎక్చేంజీ) విచారణ చేపట్టింది. కార్వీ కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టి నివేదికను సెబీకి సమర్పించింది.
2016 ఏప్రిల్ నుంచి 2019 అక్టోబర్ వరకు రూ.1096కోట్లు అక్రమంగా బదలాయించిందని ఎన్ఎస్ఈ గుర్తించింది. ఈ మొత్తాన్ని తన అనుబంధ సంస్థకు మళ్లించినట్లు తెలిపింది. క్లయింట్లకు చెందిన రూ.228.07 కోట్ల విలువైన తనఖా షేర్లను ఖాతాదారులకు తెలియకుండా బదలాయించడంతోపాటు, రూ.485 కోట్ల విలువైన అదనపు సెక్యూరీటీలను అమ్మివేసిందని, రూ.257.08 కోట్ల విలువైన సెక్యూరిటీలను తనఖా పెట్టారని, 156మంది క్లయింట్లకు చెందిన రూ.27.8 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేశారని ఎన్ఎస్ఈ తెలిపింది. ఇవేకాక, మరో 278.03 కోట్ల షేర్లను బదలాయించారని పేర్కొంది.