Maharashtra: మా మూడు పార్టీల బంధం గట్టిగానే ఉంది... ఎలాంటి గందరగోళం లేదు: అహ్మద్ పటేల్
- మహారాష్ట్రలో మరింత ముదిరిన రాజకీయాలు
- సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్
- స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్
మహారాష్ట్ర రాజకీయాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేసినా బలనిరూపణ కత్తి మెడపై వేలాడుతూనే ఉంది. ఈ వ్యవహారాలపై కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ స్పందించారు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ మధ్య బంధం బలంగానే ఉందని, ఎలాంటి గందరగోళం లేదని స్పష్టం చేశారు.
"ప్రభుత్వం ఏర్పాటు విషయంలో న్యాయపరమైన అంశాలన్నీ పరిశీలిస్తున్నాం, ప్రభుత్వం ఏర్పాటు చేయగలమన్న నమ్మకం ఉంది. మా ఎమ్మెల్యేలందరూ మాతోనే ఉన్నారు" అని వెల్లడించారు. గవర్నర్ ఉదయమే హడావుడిగా ప్రమాణస్వీకారం చేయించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని గవర్నర్ అపహాస్యం చేశారని, ఈ తరహా విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అహ్మద్ పటేల్ పేర్కొన్నారు.
శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేతో సోనియా గాంధీ ఫోన్ లో చర్చించారని, మరోసారి సమావేశమై అన్ని విషయాలపై మాట్లాడతామని తెలిపారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి జాప్యం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గకుండా అన్ని ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు.