YSRCP: వైసీపీ ఆరు నెలల పాలన గురించి ఈ ఆరు పదాల్లో చెబుతున్నాను: పవన్ కల్యాణ్
- పాలనలో విధ్వంసం, దుందుడుకు తనం, కక్ష సాధింపుతనం ఉంది
- మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నము కొనసాగుతోంది
- 151 సీట్లున్న వైసీపీ హానికర ధోరణిని ఇకనైనా ఆపాలి
వైసీపీ ఆరు నెలల పాలనను ఆరు పదాల్లో చెప్పొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 'శ్రీ జగన్ రెడ్డిగారి ఆరు నెలల పాలన ఆరు మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, దుందుడుకు తనం, కక్ష సాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నముగా చెప్పొచ్చు' అని ట్వీట్ చేశారు.
ఒక్కో పదంపై ఆయన వివరణ ఇచ్చారు. కూల్చివేత పర్వాలు, ఉద్దేశపూర్వక వరద నీరుతో రాజకీయ క్రీడలు, కార్మికుల ఆత్మహత్యలు విధ్వంసం కిందికి వస్తాయని అన్నారు. కాంట్రాక్టు రద్దులు, అమరావతి రాజధాని, జపాన్ రాయబారి-సింగపూర్ ప్రభుత్వాల నిరసనలు దుందుడుకుతనం కిందకు వస్తాయని పవన్ పేర్కొన్నారు.
శ్రీకాకుళంలో సామాన్యకార్యకర్తతో మొదలు కొని ఎమ్మెల్యే రాపాకపై కేసులు బనాయించడం, పోలీసుల వేధింపులు వంటివి కక్ష సాధింపుతనం కిందకు వస్తాయన్నారు. గ్రామ వాలంటీర్లు అంటూ 5 లక్షల ఉద్యోగాలు ప్రకటించి, 2,89,000 మాత్రమే ఇవ్వడం, 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధి పోగొట్టడం మానసిక వేదన కిందకు వస్తాయన్నారు.
అమరావతి రాజధానిగా ఉంటుందా? ఏపీకి కేంద్రం నిధులు ఇస్తుందా? అన్న విషయాలు అనిశ్చితి కిందకు వస్తాయని పవన్ తెలిపారు. ఆంగ్ల భాష బోధన అన్న వాదనతో తెలుగు భాష, సంస్కృతులను, భారతీయ సనాతన ధర్మ విచ్ఛిన్నతికి శ్రీకారం చుట్టారని పవన్ పేర్కొన్నారు. 151 సీట్లున్న వైసీపీ హానికర ధోరణిని ఇకనైనా ఆపాలని కోరుకుందామని అన్నారు.