Mahabubabad District: సినిమాల్లో పెట్టుబడి కోసం.. యూట్యూబ్‌లో చూసి నేర్చుకుని దొంగనోట్ల ముద్రణ!
- సినిమాల్లో వచ్చిన అవకాశం
- పెట్టుబడి కావాలనడంతో అడ్డదారులు
- కుటుంబం మొత్తం కటకటాల్లోకి
సినిమా రంగంలో పెట్టుబడి కోసం యూట్యూబ్‌లో చూసి నేర్చుకుని దొంగనోట్లను ముద్రిస్తున్న కుటుంబానికి పోలీసులు అరదండాలు వేశారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన సామల శ్రీనివాస్ మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడలో ఆర్‌ఎంపీగా ప్రాక్టీస్ చేసేవాడు. శ్రీనివాస్ పెద్ద కుమారుడు సాయిచరణ్ డిగ్రీ చదువుతూ సినిమా రంగం వైపు ఆసక్తితో అటువైపు వెళ్లాడు. షార్ట్‌ఫిల్మ్‌లు, ప్రైవేటు ఆల్బంలు తయారు చేస్తున్నాడు.
ఈ క్రమంలో బండ్ల గణేశ్ వద్ద పనిచేసే పేట శ్రీనివాస్ ద్వారా సాయిచరణ్‌కు ఓ సినిమాలో పెద్ద పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అయితే, కొంత పెట్టుబడి పెట్టాలనడంతో ఏం చేయాలో తోచలేదు. దీంతో నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. ఇందుకోసం యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్లను ముద్రించడం నేర్చుకున్నాడు. కలర్ ప్రింటర్, రెవెన్యూ స్టాంప్‌లకు ఉపయోగించే పేపర్లను కొనుగోలు చేసి రూ.200, రూ. 500, రూ.2వేల నకిలీ నోట్లను తయారు చేయడం మొదలుపెట్టాడు.
ముద్రించిన నకిలీ నోట్లను పట్టణాల్లో మారిస్తే గుర్తు పడతారన్న ఉద్దేశంతో గ్రామాల్లో వాటిని చలామణి చేయడం మొదలుపెట్టాడు. మూడు నెలల నుంచి ఓ వాహనంలో తిరుగుతూ, వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నోట్లను చలామణి చేయడం ప్రారంభించాడు.
ఈ క్రమంలో ఈ నెల 19న సాయంత్రం మహబూబాబాద్ జిల్లాలోని ఉప్పరపల్లిలోని ఓ బెల్టు షాపులో రూ.500 నోటు, మరో మహిళ వద్ద రూ.500 నోటు మార్చేందుకు ప్రయత్నించాడు. అవి నకిలీ నోట్లని గుర్తించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు నిన్న ఉదయం వాహనంలో వెళ్తున్న నిందితులు సామల శ్రీనివాస్, ఆయన భార్య నాగలక్ష్మి, కుమారులు సాయిచరణ్, అఖిల్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.69,900 నకిలీ నోట్లు, రూ.29,870 అసలైన నోట్లు స్వాధీనం చేసుకుని కటకటాల్లోకి పంపారు.