India: డే/నైట్ టెస్టు: ముగిసిన తొలిరోజు ఆట... టీమిండియాదే ఆధిపత్యం!
- ఆట చివరికి టీమిండియా స్కోరు 3 వికెట్లకు 174 పరుగులు
- రాణించిన కోహ్లీ, పుజారా
- తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకే ఆలౌటైన బంగ్లాదేశ్
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య కోల్ కతాలో జరుగుతున్న డే/నైట్ టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. ఆట చివరికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 59, అజింక్యా రహానే 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. పుజారా 55 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (14), రోహిత్ శర్మ (21) పెద్దగా ప్రభావం చూపకుండానే వెనుదిరిగారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌటైంది. బంగ్లా జట్టును టీమిండియా ఫాస్ట్ బౌలర్లు హడలెత్తించారు. పింక్ బాల్ తో తొలిసారి బౌలింగ్ చేస్తున్నా అద్భుతంగా బంతులు విసిరి బంగ్లా బ్యాట్స్ మెన్ ను ఓ ఆట ఆడుకున్నారు. ఇషాంత్ శర్మ 22 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లతో రాణించారు. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 68 పరుగులు. టీమిండియా రేపు వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్ ముందు భారీ స్కోరు నిలిపే అవకాశం ఉంది.