Ayodhya: అయోధ్యలో గొప్ప ఆలయం నిర్మించాలని కాంగ్రెస్ కోరుకుంటోంది: సచిన్ పైలెట్
- అయోధ్య అంశంపై రాజకీయాలు మానుకోవాలని హితవు
- సుప్రీం తీర్పు అందరికీ ఆమోదయోగ్యమన్న సచిన్ పైలట్
- తీర్పు సజావుగా అమలు జరగాలని కోరుకుంటున్నట్టు వెల్లడి
రాజస్థాన్ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ అయోధ్య అంశంపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో అత్యంత ఘనమైన ఆలయాన్ని నిర్మించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని అన్నారు. సుప్రీంకోర్టు అయోధ్య వివాదంపై ఇచ్చిన తీర్పు అందరికీ ఆమోదయోగ్యమేనని, దీనిపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరూ కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారని సచిన్ పైలట్ పేర్కొన్నారు.
ఆ తీర్పు తమకు పూర్తిగా హర్షణీయమేనని, ఆ నిర్ణయం సజావుగా అమలు జరగాలన్నదే తమ అభిమతం అని, దీనిపై రాజకీయాలు కట్టిపెట్టాల్సిన తరుణం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ముఖ్యంగా, 30 ఏళ్లుగా దీనిపై రాద్ధాంతం చేస్తున్నవారు ఇకనైనా పరిస్థితి అర్థం చేసుకుని మసలుకోవాలని హితవు పలికారు. ఈ వివాదాన్ని మళ్లీ మళ్లీ తిరగదోడడం వల్ల ఏ ఒక్కరూ రాజకీయ లబ్ది పొందే అవకాశాల్లేవని గుర్తెరగాలని అన్నారు.