India: దేశ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ విమర్శలు
- ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం
- ఏడాదికి తొమ్మిది శాతానికి పైగా వృద్ధిరేటు నమోదు కావాలి
- ప్రస్తుతం నమోదవుతున్న వృద్ధిరేటు చాలా తక్కువగా ఉంది
- దేశ ఆర్థిక వ్యవస్థ 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది
భారత్ ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ స్పందించారు. ప్రస్తుతం నమోదవుతున్న వృద్ధిరేటు చాలా తక్కువగా ఉందని, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం కాకపోవచ్చునని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ 2.7 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవాలంటే ఏడాదికి తొమ్మిది శాతానికి పైగా వృద్ధిరేటు నమోదు కావాలని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ వృద్ధి చెందగలదా? అన్న ప్రశ్నకు తావేలేదని రంగరాజన్ వివరించారు. ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచిపోయాయని, అయినప్పటికీ ఈ ఏడాది వృద్ధిరేటు ఆరు శాతం లోపే ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది దేశ ఆర్థిక వృద్ధి రేటు ఏడు శాతానికి దగ్గర్లో ఉండొచ్చని తెలిపారు. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని వివరించారు.