Telangana: 2020లో ఒకటి, రెండు రోజులు సెలవు పెడితే... ఐదారు రోజులు కలిసొచ్చే సమయాలివి!
- తెలంగాణలో సెలవుల జాబితా విడుదల
- పలుమార్లు వరుస సెలవులకు అవకాశం
- ముందే ప్లాన్ చేసుకుంటే మంచి చాన్స్
వచ్చే సంవత్సరం సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సంవత్సరం శనివారం లేదా సోమవారం నాడు వచ్చిన పర్వదినాల సంఖ్య ఎక్కువగానే ఉంది. అంటే రెండు రోజులు సెలవులు వచ్చే కాలమన్నమాట. ఇక ఇదే సమయంలో మరో ఒకటి లేదా రెండు రోజులు సెలవు పెట్టుకుంటే, నాలుగైదు రోజులు సెలవులు ఎంజాయ్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి.
జనవరిలో 14న మంగళవారం భోగి, 15న బుధవారం సంక్రాంతి పర్వదినాలున్నాయి. జనవరి 11వ తేదీ 2వ శనివారం, 12న ఆదివారం కావడంతో, 13వ తేదీ సోమవారం నాడు సెలవు పెట్టుకుంటే ఐదు రోజుల సెలవులను ఎంజాయ్ చేయవచ్చు.
ఇక మహా శివరాత్రి ఫిబ్రవరి 21 శుక్రవారం నాడు వచ్చింది. 22వ తేదీ నాలుగో శనివారం, 23 ఆదివారం. ఆపై ఒకటి లేదా రెండు రోజులు సెలవు పెట్టుకోగలిగితే, మరోసారి ఐదు రోజులు ఎక్కడికైనా వెళ్లి రావచ్చు.
మార్చిలో 23న సోమవారం నాడు షబ్ ఏ మెరాజ్ పర్వదినం ఐచ్ఛిక సెలవు కాగా, ఆపై 25న ఉగాది సెలవుంది. వీటికి ముందు 22న ఆదివారం ఎలాగూ ఉంటుంది. 24న సెలవు పెట్టుకుంటే నాలుగు రోజుల సెలవు లభిస్తుంది.
జూలై 31న శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 3న రాఖీ పౌర్ణమి (ఐచ్ఛిక సెలవులు) ఉన్నాయి. వీటి మధ్య ఆగస్టు 1 శనివారం నాడు బక్రీద్ రానుంది. ఆదివారం సెలవు, రెండు ఐచ్ఛిక సెలవు దినాలతో కలిపి మరోసారి ఐదు రోజుల సెలవులను ఆనందించే వీలుంటుంది.
గాంధీజయంతి అక్టోబర్ 2 శుక్రవారం వచ్చింది. ఒక రోజు సెలవు పెట్టుకుంటే, ఆదివారం కలిపి, మూడు రోజుల వరుస సెలవులు వస్తాయి. మిలాడినబి కూడా శుక్రవారం (అక్టోబర్ 30) నాడు రానుంది. ఒక రోజు సెలవుతో మూడు రోజుల సెలవులు వస్తాయి.
నవంబర్ 30న సోమవారం నాడు కార్తీక పూర్ణమి సెలవు. దానికి ముందు నాలుగో శనివారం, ఆదివారం ఎలానూ సెలవులే. 27న ఐచ్ఛిక సెలవుగా యాజ్ దుహమ్ షరీఫ్ రానుంది. అటూ ఇటూ ఒకటి రెండు రోజులు సెలవుతో ఏకంగా దాదాపు వారం రోజుల పాటు ఎటైనా వెళ్లి రావచ్చు.
ఇదే సమయంలో మొత్తం మీద ప్రభుత్వం ప్రకటించిన 23 సాధారణ సెలవుల్లో ఆరు సెలవులు శనివారం నాడు వస్తున్నాయి. దీంతో ఆదివారం కూడా సెలవు దొరకనుంది. ముందుగా ప్లాన్ చేసుకుంటే, ఈ సంవత్సరం సెలవులే సెలవులనడంలో సందేహం లేదు.
(ఈ వరుస సెలవుల జాబితా, తెలంగాణ ప్రకటించిన సెలవుల జాబితా నుంచి తయారు చేసినదే అయినా, ఏపీలోనూ దాదాపు ఇదే సమయాల్లో పర్వదినాలు, సెలవులు ఉంటాయి కాబట్టి, తెలుగు రాష్ట్రాల వారు ఎవరైనా, ఈ రోజుల్లో విహారాలకు, తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకోవచ్చు)