Maharashtra: ‘మహా’ మంత్రి పదవులపై పీటముడి.. అందరికీ అవే కావాలట!
- ఆర్థికశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలపై మూడు పార్టీలు పట్టు
- స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్, ఎన్సీపీలు డిమాండ్
- రొటేషన్ సీఎం కోసం పట్టుబట్టని ఎన్సీపీ
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు ఓ అంగీకారానికి వచ్చినప్పటికీ మంత్రి పదవులపై చిక్కు ముడి వీడడం లేదు. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాకరే ఉండాలన్న నిర్ణయంపై అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నా.. కొన్ని మంత్రి పదవులను మాత్రం అందరూ కోరుకుంటుండడంతో సమస్య మళ్లీ మొదలైనట్టు కనిపిస్తోంది.
ఏర్పడబోయే ప్రభుత్వంలో మంత్రి పదవుల విషయంలో మూడు పార్టీలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలన్న కాంగ్రెస్.. స్పీకర్, ఆర్థిక శాఖ, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూశాఖలు తమకు కావాలని కోరుకుంటోంది. శివసేన పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడీ, హోం మంత్రిత్వశాఖ, ఉన్నత విద్య, గ్రామీణాభివృద్ధి శాఖలను అడుగుతోంది. మరో కూటమి పార్టీ అయిన ఎన్సీపీ స్పీకర్ పదవితోపాటు హోంశాఖ, ఆర్థికశాఖ, పీడబ్ల్యూడీ, జలవనరులు, గ్రామీణాభివృద్ధి శాఖలను కోరుకుంటోంది.
మూడు పార్టీలు ఆర్థికశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు కావాలని పట్టుబడుతుండగా, స్పీకర్ పదవి తమకు కావాలంటే తమకు కావాలంటూ కాంగ్రెస్, ఎన్సీపీలు కోరుతున్నాయి. శివసేన, ఎన్సీపీలు పీడబ్ల్యూడీ, హోంశాఖలు అడుగుతున్నాయి. దీంతో ఈ విషయంలో నేడు తుది నిర్ణయం తీసుకోవాలని పార్టీలు భావిస్తున్నాయి. అయితే, రొటేషన్ పద్ధతిలో సీఎం పోస్టు కోసం మాత్రం ఎన్సీపీ పట్టుబట్టకపోవడం విశేషం.