kolhapur: కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. మంటలు, పొగలతో ప్రయాణికుల బెంబేలు
- తెగి బోగీపై పడిన జంపరు వైరు
- రాత్రి 9:40 గంటల సమయంలో ఇంటికన్నె సమీపంలో ఘటన
- పరుగులు పెట్టిన ప్రయాణికులు
మణుగూరు-కొల్హాపూర్ మధ్య నడిచే కొల్హాపూర్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం నుంచి బయలుదేరిన రైలు ఇంటికన్నె సమీపిస్తుండగా ఇంజిన్‌పై యాంటెన్నా, ఓహెచ్‌ఈ తీగకు అనుసంధానంగా ఉండే జంపర్ తెగిపోయి బోగీపై పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించింది. నిన్న రాత్రి 9:40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
భయపడిన ప్రయాణికులు రైలు నుంచి దూకి పరుగులు తీశారు. కొందరు రైలు చైన్ లాగడంతో రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు కిందికి దిగి అరుస్తూ పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదమూ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాజీపేట జంక్షన్ నుంచి మరో ఇంజిన్‌ను తీసుకొచ్చి రైలుకు అనుసంధానం చేసిన తర్వాత రాత్రి 1:15 గంటలకు రైలు బయలుదేరింది.