Tamilnadu: రజనీకాంత్, కమలహాసన్ లు కలిస్తే... ఎలుక, పిల్లీ కలిసినట్లే!: అన్నాడీఎంకే ఎద్దేవా
- కమల్ హేతువాది, కమ్యూనిజంపై మాట్లాడతారు
- రజనీకాంత్ ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తి
- వీరిద్దరి కలయిక.. పరస్పర వ్యతిరేక భావాల కలయికే..
తమిళనాడు ప్రజల సంక్షేమంకోసం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తాము కలిసి పాటుపడతామంటూ సుప్రసిద్ధ తమిళ నటులు రజనీకాంత్, కమలహాసన్ వేరు వేరు సందర్భాల్లో చేసిన ప్రకటనలపై అన్నాడీఎంకే పార్టీ మండి పడింది. వచ్చే రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ కలుస్తామనడం పరస్పరం వైరిభావాలున్న ఎలుక, పిల్లి కలిసినట్లుందని అభివర్ణించింది. ఈ మేరకు అన్నాడీఎంకే తన అధికారిక పత్రిక ‘నమదు అమ్మ’లో పేర్కొంది.
‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అధినేతగా కమలహాసన్ కొనసాగుతూ హేతువాదం, కమ్యూనిజం అంశాలపై మాట్లాడుతుండగా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆధ్యాత్మిక రాజకీయాలు ప్రస్తావిస్తున్నారని తెలిపింది. కాగా, రజనీకాంత్ 2021 ఎన్నికల ముందు పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
‘ఆధ్యాత్మిక రాజకీయాల గురించే మాట్లాడే రజనీకాంత్, హేతువాదం కమ్యూనిజంపై మాత్రమే మాట్లాడే కమల్ తో కలిసి పనిచేస్తామనడం పిల్లి, ఎలుక కలిసి జీవించడంలా ఉంటుంది. కమల్ తో కలిసి పనిచేయడం మూలంగా రజనీకాంత్ కు రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం కలుగదు. కాలమే రజనీకి పాఠం చెపుతుంది’ అని పేర్కొంది.