Congress: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఊపందుకున్న ప్రయత్నాలు.. స్వీట్లు ఆర్డరిచ్చామన్న ఉద్ధవ్
- మహారాష్ట్రలో కొనసాగుతున్న ఉత్కంఠ
- నేడు కాంగ్రెస్-ఎన్సీపీ నేతల భేటీ
- రేపు మూడు పార్టీల మధ్య చర్చలు
మొత్తానికి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడేలానే కనిపిస్తోంది. బీజేపీతో కటీఫ్ చెప్పిన శివసేన కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య అవగాహన కుదిరినట్టు తెలుస్తోంది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా శివసేన, కాంగ్రెస్- ఎన్సీపీలు ఓ అవగాహనకు వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంలో మరింత స్పష్టత కోసం నేడు కాంగ్రెస్-ఎన్సీపీలు సమావేశం కానున్నాయి. అనంతరం ఈ రెండు పార్టీల నేతలు శివసేన నేతలతో రేపు సమావేశం అవుతారు. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఊహాగానాలకు ఉద్ధవ్ థాకరే ఫుల్ స్టాప్ పెడతారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. మరోవైపు, ఉద్ధవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తర్వలోనే తమ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని, స్వీట్లకు ఆర్డర్ ఇచ్చేశామని పేర్కొంటూ అభిమానులు, కార్యకర్తల్లో జోష్ పెంచే ప్రయత్నం చేశారు.