Sri Lanka: రిటైర్మెంట్ పై శ్రీలంక క్రికెటర్ మలింగా పునరాలోచన
- మరో రెండేళ్లు కొనసాగుతానంటూ ప్రకటన
- నా సామర్థ్యంతో ఆటలో కొనసాగుతా
- టీ20 ప్రపంచకప్ జట్టుకు కెప్టెన్ గా కొనసాగడంపై బోర్డు ప్రకటన చేయలేదు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ లసిత్ మలింగా తన రిటైర్మెంట్ పై చేసిన ప్రకటనను వెనక్కి తీసుకున్నాడు. మరో రెండేళ్లు ఆడతానని చెప్పాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని యార్కర్ కింగ్ గా పేరుపొందిన 36 ఏళ్ల మలింగా ఇటీవల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని ప్రకటించాడు.
‘టీ 20 ల్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. నా నైపుణ్యం, సామర్థ్యంతో బౌలర్ గా మరికొంతకాలం ఆడవచ్చని అనుకుంటున్నా. ప్రపంచవ్యాప్తంగా నేను ఎన్నో టీ20 మ్యాచ్ లు ఆడాను. మరో రెండేళ్లు కూడా ఈ ఫార్మాట్లో కొనసాగగలనని అనిపిస్తోంది’ అని అన్నాడు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ గా పేరుపొందిన మలింగా టీ 20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. అంతేకాదు, టీ20ల్లో వరుసగా ఐదుసార్లు హ్యాట్రిక్ తో పాటు, వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు.
రానున్న ప్రపంచకప్ లో తాను జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడంపై బోర్డు నుంచి స్పష్టత రావాల్సి ఉందన్నాడు. గతంలో కెప్టెన్ గా బాధ్యత చేపట్టమన్నారని.. అయితే శ్రీలంకలో ఎప్పుడేం జరుగుతుందో అంచనా వేయడం కష్టమని అన్నారు. మళ్లీ తానే సారథిగా ఉంటే నమ్మిన ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తానని చెప్పారు. జట్టులో నిలకడగా కొనసాగితేనే ఆటగాళ్లు రాణిస్తారు. బెంచ్ కే పరిమితమైతే వారి ఆటలో మార్పురాదని పేర్కొన్నాడు.