Telangana: తెలంగాణ గవర్నర్ ను కలిసిన విపక్ష నేతలు
- గవర్నర్ ను కలిసిన కోదండరామ్, చాడ తదితర నేతలు
- ఆర్టీసీ సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని వినతి
- కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు: కోదండరామ్
ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గవర్నర్ తమిళిసైను విపక్ష నేతలు కలిశారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, టీటీడీపీ నేత ఎల్.రమణ, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఇతర నేతలు ఈరోజు రాజ్ భవన్ కు వెళ్లారు. ఆర్టీసీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆమెను కోరారు.
అనంతరం మీడియాతో కోదండరామ్ మాట్లాడుతూ, కోర్టు చర్చలు జరపమంటే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కార్మికులు ఎప్పుడు వచ్చినా విధుల్లోకి తీసుకోవాలని కోర్టు చెప్పిందని, ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్ శర్మ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాసమస్యలపై గవర్నర్ కు వున్న శ్రద్ధ సీఎం కేసీఆర్ కు లేదని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ రాజకీయనేతలా మాట్లాడారని మండిపడ్డారు. ఎల్. రమణ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులను అణచివేయాలని చూస్తున్నారని కేసీఆర్ పై ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ ఆస్తులను తన వాళ్లకు కట్టబెట్టాలని కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు.