Nara Lokesh: సూటిగా అడుగుతున్నా... గతంలో కంటే ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా జగన్ గారూ: నారా లోకేశ్
- ఏపీ మద్యం పాలసీపై లోకేశ్ విమర్శలు
- మద్యం ఏరులై పారుతోందని వ్యాఖ్యలు
- రేట్లు పెంచి దోపిడీ చేస్తున్నారని ఆరోపణ
ఏపీలో మద్యనిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని వైసీపీ సర్కారు చెబుతోంది. ఈ క్రమంలో తొలి విడతగా మద్యం షాపులు, బార్లు తగ్గించి, మద్యం రేట్లు పెంచడం తెలిసిందే. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు. మద్యపాన నిషేధం కోసం జగన్ మందడుగు వేస్తున్నారంటూ సెటైర్ వేశారు. ఓవైపు మద్య నిషేధం దిశగా చర్యలు అని చెబుతున్నా, రాష్ట్రంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో మద్యం ఏరులై ప్రవహిస్తోందని, గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్టుషాపులు వెలిశాయని ఆరోపించారు. జగనన్న మద్యం దుకాణాల్లో రేట్లు పెంచేసి వైసీపీ తరహా దోపిడీ కొనసాగిస్తున్నారని తెలిపారు. "రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే మద్యపాన నిషేధం కోసం శ్రమిస్తున్నాం, బార్ల సంఖ్య తగ్గిస్తున్నాం అని ఉపన్యాసాలు ఇస్తున్న మిమ్మల్ని సూటిగా ఓ విషయం అడుగుతున్నా, సమాధానం చెప్పండి... గతంలో కంటే ఒక్క క్వార్టర్ బాటిల్ అమ్మకం తగ్గిందా జగన్ గారూ!" అంటూ ప్రశ్నించారు.