Sridevi: వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి రిజర్వేషన్ పై విచారణకు ఆదేశించిన ఈసీ
- తాను క్రిస్టియన్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన శ్రీదేవి
- ఎస్సీ రిజర్వుడు స్థానంలో పోటీ చేసే అర్హత లేదని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన సంతోశ్ అనే వ్యక్తి
- విచారణ జరపాలంటూ ఈసీని ఆదేశించిన రాష్ట్రపతి కార్యాలయం
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తా? కాదా? అనే విషయంపై విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని వివరాల్లోకి వెళ్తే, ఓ ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ అని శ్రీదేవి చెప్పుకున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున సంతోశ్ అనే వ్యక్తి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. క్రిస్టియన్ అయిన శ్రీదేవికి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అర్హత లేదని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం... ఈ అంశంపై విచారణ జరపాలంటూ ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో, శ్రీదేవి రిజర్వేషన్ పై విచారణ జరపాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల నేపథ్యంలో, ఈనెల 26న మధ్నాహ్నం 3 గంటలకు తమ ముందుకు విచారణకు రావాలని శ్రీదేవిని జాయింట్ కలెక్టర్ దినేశ్ కుమార్ కోరారు. ఎస్సీ అని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలను తీసుకురావాలని సూచించారు.