Pawan Kalyan: మరోసారి జగన్ పై విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్
- తెలుగు భాషను చంపేయాలన్న ఆలోచన భస్మాసుర హస్తాన్ని సూచిస్తోంది
- మాతృ భాషను మృత భాషగా మార్చకండి
- 'మా తెలుగు తల్లికి' అంటూ పాడాల్సిన మీరు... తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు
పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలతో పాటు పలువురు మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాన్ని ఏలుతూ, తెలుగు మీడియాను నడుపుతూ, తెలుగును చంపేయాలన్న ఆలోచన భస్మాసుర హస్తాన్ని సూచిస్తోందంటూ సీఎం జగన్ పై ఆయన మండిపడ్డారు. మాతృ భాషను మృత భాషగా మార్చకండని అన్నారు.
ఇంగ్లీషు భాష వద్దని ఎవరూ చెప్పడం లేదని... కానీ, తెలుగును మాతృ భాషగా కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో ముఖ్యమంత్రి చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. మాతృ భాషను, మన మాండలికాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని అన్నారు. 'జగన్ రెడ్డి గారు, 'మా తెలుగు తల్లికి' అంటూ పాడాల్సిన మీరు... తెలుగు భాష తల్లినే చంపేస్తున్నారు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భాష సరస్వతిని అవమానించకండి అని చెప్పారు. ఈ సందర్భంగా సరస్వతి దేవి ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. దీంతో పాటు, పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోస్ట్ చేశారు.