Chandrababu: మళ్లీ తెరపైకి చంద్రబాబు ఆస్తుల కేసు.. లక్ష్మీపార్వతి పిటిషన్‌పై విచారణకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్
- ఈ నెల 25కు విచారణ వాయిదా
- 2005లో చంద్రబాబుకు స్టే
- సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో విచారణ ప్రారంభం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై దాఖలైన ఆస్తుల కేసు విచారణను తిరిగి ప్రారంభించనున్నట్టు హైదరాబాదు, నాంపల్లిలోని ఏసీబీ కోర్టు తెలిపింది. వైసీపీ నేత లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన స్టే పొడిగించకపోవడంతో త్వరలోనే విచారణ ప్రారంభిస్తామని న్యాయమూర్తి తెలిపారు. లక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని ఆదేశించారు. కేసు విచారణను ఈ నెల 25కు వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ 2005లో లక్ష్మీపార్వతి ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కేసు విచారణ ప్రారంభానికి ముందే చంద్రబాబు దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ 2005లో స్టే విధించింది.
సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించి ఉండకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తాజాగా, చంద్రబాబు ఆస్తుల కేసు ఏసీబీ కోర్టు ముందుకు వచ్చింది. హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతోందని విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్ వాదించారు. అయితే, సుప్రీం తీర్పు ప్రకారం స్టే ఆరు నెలలకు మించి చెల్లదని లక్ష్మీపార్వతి తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి 2005 తర్వాత స్టే పొడిగింపు లేని కారణంగా విచారణ ప్రక్రియ తిరిగి ప్రారంభం అవుతుందని తెలిపారు.