Jarkhand: టికెట్ ఇవ్వలేదు కదా.. సీఎంపై పోటీ చేస్తా: ఝార్ఖండ్ బీజేపీ ఎమ్మెల్యే సరయు రాయ్ ప్రకటన
- ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటివరకు 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ అధిష్ఠానం
- స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతా
- సీఎం పోటీచేసే నియోజకవర్గంతో పాటు, నా సొంత నియోజకవర్గంలో.. పోటీచేస్తా
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ వెలువరించిన అభ్యర్థుల జాబితాలో.. ఇప్పటివరకు సీటు దక్కని ఆ పార్టీ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే సరయు రాయ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని నిన్న ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సరయు రాయ్ పశ్చిమ జంషెడ్ పూర్ నుంచి విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల్లో తూర్పు జంషెడ్ పూర్, పశ్చిమ జంషెడ్ పూర్ నియోజక వర్గాల నుంచి పోటీచేస్తానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు గవర్నర్ కు కూడా లేఖ రాశారు.
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు రాష్ట్ర అసెంబ్లీకి ఐదు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ ఇప్పటివరకు నాలుగు జాబితాలను విడుదల చేసింది. వీటిలో 72 మంది పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాల్లో తన పేరు లేకపోవడంతో రాయ్ సీఎంకు వ్యతిరేకంగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు రాయ్ తెలిపారు. తన మద్దతుదారులు తన సొంత నియోజకవర్గం నుంచి ప్రచారం చేస్తారన్నారు. తూర్పు జంషెడ్ పూర్ నియోజకవర్గం ప్రచారంపై దృష్టిని కేంద్రీకరిస్తానని రాయ్ వెల్లడించారు.