TTD: తిరుమలలో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు... టీటీడీ కార్యాచరణ
- తిరుమలను ప్లాస్టిక్ రహితం చేసేందుకు టీటీడీ నిర్ణయం
- లడ్డూ కవర్ల స్థానంలో జనపనార సంచులు, పేపర్ బాక్సులు
- త్వరలో ప్లాస్టిక్ బాటిళ్లపైనా నిషేధం!
సుప్రసిద్ధ హైందవ పుణ్యక్షేత్రం తిరుమల గిరులపై ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయంటూ కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రక్షాళనకు ఉపక్రమించింది. తిరుమలను ప్లాస్టిక్ రహితం చేసేందుకు నడుం బిగించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న లడ్డూ కవర్ల స్థానంలో పేపర్ బాక్సులు, జనపనారతో తయారైన సంచులు భక్తులకు అందించాలని నిర్ణయించింది. అంతేకాదు, తిరుమలలో ఉన్న గెస్ట్ హౌసులు, హోటళ్లలో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించాలని కూడా టీటీడీ భావిస్తోంది. వచ్చే నెల తర్వాత తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లను అనుమతించరాదన్న ప్రతిపాదనను బోర్డు పరిశీలిస్తోంది.