JNU: శాంతించని ఢిల్లీ జేఎన్ యూ విద్యార్థులు... పార్లమెంటు ముట్టడికి యత్నం
- జేఎన్ యూలో హాస్టల్ ఫీజు పెంపు
- ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనలు
- కీలక మెట్రో స్టేషన్ల మూసివేత
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆగ్రహజ్వాలలు కొనసాగుతున్నాయి. హాస్టల్ ఫీజును రూ.2500 నుంచి రూ.7500కు పెంచడంతో విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. దీనిపై గత కొన్నిరోజులుగా విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పెంచిన ఫీజులు తగ్గించాలంటూ విద్యార్థులు చేస్తున్న ధర్నాలు, నిరసనలకు వర్శిటీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. గతవారం స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడ్ని అడ్డుకునేందుకు కూడా యత్నించారు.
తాజాగా, 2 వేల మంది విద్యార్థులు పార్లమెంటు ముట్టడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఢిల్లీలోని కీలక మెట్రో రైల్వే స్టేషన్లలో కార్యకలాపాలు నిలిపివేశారు. రోడ్లపైకి వచ్చిన వేలాది మంది విద్యార్థులు పోలీసులతో ఘర్షణకు దిగడంతో మెట్రో రైల్ విభాగం ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్, లోక్ కల్యాణ్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లను మూసివేసింది.