Bangladesh: మైదానంలో కొట్టుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు.. దేశవాళీ పోటీల్లో ఘటన!
- బంతిని షైన్ చేయొద్దన్న సహచర ఆటగాడు
- ఎందుకు చేయొద్దంటూ బౌలర్ దాడి
- ఏడాదిపాటు నిషేధించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
బంగ్లాదేశ్ దేశవాళీ క్రికెట్ లో ఇద్దరు క్రికెటర్లు మైదానంలోనే కొట్టుకున్న సంఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. వారిద్దరూ గతంలో జాతీయ జట్టుకు ఆడినవారే కావడం గమనార్హం. బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్ లో భాగంగా ఢాకా, ఖుల్నా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బౌలర్ షహాదత్ హుస్సేన్ బౌలింగ్ చేసేందుకు ఉపక్రమించగా, తోటి ఆటగాడు అరాఫత్ సన్నీ బంతిని ఒకవైపే షైన్ చేయొద్దని సూచించాడు. అది సరైన పద్ధతి కాదని సన్నీ చెప్పడంతో షహదత్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
నేరుగా వెళ్లి సన్నీపై చేయి చేసుకున్నాడు. దాంతో సన్నీ కూడా స్పందించడంతో ఇతర ఆటగాళ్లు వచ్చి వారిద్దరినీ విడదీశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బౌలర్ షహాదత్ హుస్సేన్ తప్పుచేసినట్టుగా నిర్ధారించి ఏడాదిపాటు నిషేధం విధించింది. దీనిపై షహాదత్ మాట్లాడుతూ, ఎందుకు బంతిని షైన్ చేయొద్దంటున్నావు అని అడగడంతో అసభ్యంగా ఏదో అన్నాడని, అందుకే సహనం కోల్పోయానని వివరించాడు. షహాదత్ కు నిషేధం కొత్తకాదు. గతంలోనూ ఓసారి భార్యపై గృహహింస కారణంగా బోర్డు అతడిపై నిషేధం వేటు వేసింది.