tsrtc: ఆర్టీసీ ‘మహాదీక్ష’ను అడ్డుకునేందుకు పోలీసుల భారీ భద్రత.. యువకుడి నిశ్చితార్థం వాయిదా!
- ఇందిరాపార్క్ వైపు వెళ్లే దారులను మూసేసిన పోలీసులు
- అదే ప్రాంతంలోని అమ్మాయితో సోమాజిగూడ యువకుడి నిశ్చితార్థం
- యువతి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకున్న పోలీసులు
తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఆదివారం ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన మహాదీక్షను అడ్డుకునేందుకు పోలీసులు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఓ యువకుడి నిశ్చితార్థాన్ని ఆపేశాయి. సోమాజిగూడలోని ఎంఎస్ మక్తాకు చెందిన వెంకటేశ్‌కు ఇందిరాపార్క్ సమీపంలో ఉండే యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. ఇందులో భాగంగా నిన్న నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఇందుకోసం యువకుడి కుటుంబ సభ్యులు నిశ్చితార్థం జరపాలని నిర్ణయించుకుని నిన్న ఉదయం 11 గంటలకు ముహూర్తం పెట్టుకున్నారు. పది గంటలకు యువకుడి కుటుంబ సభ్యులు వాహనంలో యువతి ఇంటికి బయలుదేరారు.
అయితే, ఆర్టీసీ కార్మికుల ‘మహాదీక్ష’ను అడ్డుకునేందుకు పోలీసులు ఇందిరాపార్క్ వైపు వెళ్లే దారులను మూసివేశారు. దీంతో వెంకటేశ్‌కు తిప్పలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి లిబర్టీ వద్దకు చేరుకోగా అక్కడ అడ్డంగా బారికేడ్లు కనిపించాయి. హిమాయత్ నగర్ మీదుగా వెళ్లాలని భావించి అక్కడికి వెళ్లగా అక్కడా వారిని అనుమతించలేదు. అక్కడి నుంచి తిరిగి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా వెళ్లాలని నిర్ణయించుకుని అక్కడకు వెళ్లినా పోలీసులు వారిని తిప్పి పంపారు.
దీంతో వారు అమ్మాయి తరపు వారికి ఫోన్ చేసి తమకు ఎదురైన పరిస్థితిని వివరించారు. అంతా విన్న వారు కట్టమైసమ్మ గుడి నుంచి రావాలని చెప్పారు. వారు చెప్పినట్టే అక్కడకు వెళ్లినా వారి ప్రయత్నం సఫలం కాలేదు. అక్కడా వారికి బారికేడ్లు దర్శనమిచ్చాయి. దీంతో విసిగిపోయిన వెంకటేశ్ కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తాము నిశ్చితార్థం కోసం వెళ్తున్నామని, వదిలిపెట్టాలని కోరినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిశ్చితార్థాన్ని వాయిదా వేసుకుని అక్కడి నుంచి వెనుదిరిగారు.