Alla Nani: చింతమనేనిపై నమోదైన కేసులన్నీ టీడీపీ హయాంలోనివే: ఆళ్ల నాని

  • తమ ప్రభుత్వం కొత్తగా కేసులు పెట్టలేదని వెల్లడి
  • చింతమనేని తన కేసులపై చంద్రబాబును అడగాలని సూచన
  • పవన్ లాంగ్ మార్చ్ నిర్వహించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యలు

ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని దెందులూరు మాజీ శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ వ్యవహారంపై స్పందించారు. చింతమనేని తమపై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్టు తెలిపారు. చింతమనేనిపై నమోదైన కేసులన్నీ టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదైనవేనని స్పష్టం చేశారు. ఆ కేసుల దర్యాప్తులో భాగంగానే చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారే తప్ప, కొత్తగా తాము నమోదు చేసిన కేసులేవీ లేవని వెల్లడించారు. చింతమనేని తనపై ఉన్న కేసుల గురించి చంద్రబాబును ప్రశ్నిస్తే బాగుంటుందని హితవు పలికారు.

ఇసుక అంశంపైనా ఆళ్ల నాని వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లుగా టీడీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా చేసి నారా లోకేశ్ కు ముడుపులు చెల్లించారని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణా జరిగింది గత ప్రభుత్వ హయాంలోనే అని, అందుకు వనజాక్షి వ్యవహారమే నిదర్శనం అని అన్నారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్నందుకే వనజాక్షిపై దాడి జరిగిందని, ఆ వ్యవహారాన్ని సీఎం కార్యాలయంలోనే పరిష్కరించారని ఆరోపించారు. ఐదేళ్లుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే నోరు మెదపని పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహించడం ఏంటని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News